నేలపై ఉమ్మి వేసినందుకు నాలుకతో నాకించి, మహిళలతో చెప్పులతో కొట్టించారు!

  • బీహార్‌లో మరో దారుణ ఘటన
  • సుమోటోగా స్వీకరించిన అధికారులు
  • విచారణకు ఆదేశం.. దోషులను కఠినంగా శిక్షిస్తామన్న మంత్రి
బీహార్‌లోని నలందా జిల్లాలో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన జరిగింది. ఓ వ్యక్తి నేలపై వేసిన ఉమ్మిని అతడి నాలుకతోనే నాకించి, మహిళలతో చెప్పులతో కొట్టించిన అమానవీయ ఘటన చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన ఠాకూర్ నాయీ బ్రాహ్మణుడు. బార్బర్ షాపు పెట్టుకుని జీవిస్తున్నాడు. బుధవారం రాత్రి ఖైనీ కోసం పొరిగింటిలో నివసించే సర్పంచ్ సురేంద్ర యాదవ్ ఇంటికి వెళ్లాడు. వెళ్తూవెళ్తూ బయట ఉమ్మి వేశాడు. తలుపు కొట్టకుండా లోపలికి ప్రవేశించాడు. ఆ సమయంలో ఇంట్లో పురుషులు కూడా ఎవరూ లేకపోవడంతో అతను దురుద్దేశంతోనే వచ్చాడని భావించారు. గురువారం ఉదయం పంచాయితీ పెట్టిన  సురేంద్రయాదవ్ బాధితుడిని మహిళల చెప్పులతో కొట్టించాడు. అనంతరం ఘటనా స్థలానికి తీసుకెళ్లి వేసిన ఉమ్మిని నాలుకతో నాకించినట్టు బీహార్ షరీఫ్ ఎస్‌డీఓ సుధీర్ కుమార్ తెలిపారు.

మీడియా ద్వారా ఈ ఘటన వెలుగులోకి రావడంతో అధికారులు స్పందించి విచారణకు ఆదేశించారు. కాగా, ఠాకూర్ దురుద్దేశంతోనే సురేంద్ర యాదవ్ ఇంటికి వెళ్లినట్టు పోలీసులు చెబుతున్నారు. అతడిని 25 సార్లు చెప్పులతో కొట్టాలని పంచాయితీలో ఆదేశించారని, తర్వాత దానిని ఐదుసార్లకు తగ్గించారని పోలీసులు తెలిపారు. ఘటనపై స్పందించిన మంత్రి నంద్ కిషోర్ యాదవ్ ఇటువంటి వాటిని సహించబోమని హెచ్చరించారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Go Back to Shorts
Bihar
punishment
saliva
lick
Nalanda

More Telugu News